SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Friday, September 27, 2019

కృష్ణ శతకం (ఆట వెలది) -119

                      కృష్ణ శతకం


      

01. శిలకు రూప మిచ్చి శిల్పముగనుమార్చె
గురుతరముగనుండె గురువ రేణ్య
సాహితీ కులమున సాధించె వేణుశ్రీ
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు  


02. అప్పు లెన్నొచేసి గొప్పగ తిరిగిరి   
అప్పు తీర్చ మంటె  యలిగి పోయె
కోపములును వచ్చె  కొట్లాట పెట్టిరి 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు  


03. చేదు బీర దెచ్చి  చేటనిండతరిగి  
గరిటెశర్కరేసె   గంట నుడక      
తీపి నుండునేమి  తినుటకు కుదురునా         
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


04. నీతి తప్పి వారు  నీతులు వల్లించి     
ధర్మమిడిచి యికను  దాత యైన      
పుణ్య మేల వచ్చు పుణ్యాత్ములవలెను 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు



భావం : నీతి నియమం పాటించని వారు  ఎన్ని నీతులు  వల్లించినా  
ఉపయోగం ఏమి . ధర్మం తప్పిన వారు  ఎంత దానం చేసినా    
ఫలితమేమి . అలాంటి  వారు చెప్పే  నీతులు ,చేసే  దాన ధర్మాల    
వలన పుణ్యమెలా వస్తుంది . 


05.  కులము వంక బెట్టి , కుట్రలు చేసిరి      
సర్టిఫికెటులనియు సాగదీసె     
ప్రభుత మతులబేమొ  పరమేశ్వరుడెరుగు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ప్రతి సారి  కులాన్ని  లేవనెత్తి  కుట్రలు చేసిరి  .    
కుల సర్టిఫికెట్ల గురించి  వాదించి  చతికిల బడిరి. (కుల సర్టిఫికెట్లు  

కేవలం సర్కారు  పేదలకు ,   సంక్షేమ పధకాలను , లోన్ల మాఫీలను , 
సబ్సిడీలను  అమలు చేయడానికి మాత్రమే) .  వాస్తవానికి ,   
ప్రభుత్వ ఆలోచనలు  సామాన్యులకు   ఏమి తెలుసు .  


06. కోతి రాతలెన్నొ   కొంగజపాలెన్నొ
జనం కోరు  మాటె  జనము  మెచ్చు 
వేదములను నేర్చి  వెనుకాయ రావణ 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: కొందరు ఏవేవో వ్రాస్తారు. నిత్యం జపాలు చేస్తారు. 
వీరి ఆత్మ అంతరాత్మ ఒకటి కానపుడు ఏమి వ్రాసినా, ఏమి 
చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సకల సాహిత్యం, 
వేదాలు తెలిసిన పండితుడైన రావణుడు చివరికి వధించ 
బడినాడు కదా .

07. అనువుగాని చోట  నడుగుపెట్టతగదు  
దుష్టులున్నచోట  దూరముండు
మర్రి చెట్టుకింద  మానులు యెదుగునా   
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం: మనకు అనుకూలంగా లేని చోటికి వెళ్ళకూడదు. 
అలానే మనకు నచ్చని వారికి దూరంగా ఉండాలి. మర్రి 
చెట్టు కింద ఎలాంటి మొక్కలైనా యెదగవు.

08. గరిటె  శర్కరేసి   గన్నేరు  పలుకుల్లొ  
పగలు నంత రుబ్బి   ఫలము ఏమి  *
ఖలుని కెన్ని జెప్ప  కార్యము  మానునా   
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు



భావం: గన్నేరు చెట్టు విషపూరితం. అలాంటి గన్నేరు పప్పులో , 
గంటెడు  పంచదారను పోసి , రోజంతా కూర్చుని రుబ్బినా అది 
విషమే అవుతుంది. అలానే లోపల ఒకటి , బయటకు ఒకటి 
మాట్లాడే  కుటిల నీచుల కర్మలు  మారుతాయా  . 

09.  అహముతోడ నుండు  నమవాస్య దినమున 
పౌర్ణమిదినమందు  పాల వలెను  
ఊసరెల్లి వలె  ఊరూర  మారును 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం : కొందరు ప్రతి అమా  వాస్యరోజున  అహం తోను మరియు 
పౌర్ణమిరోజున   ప్రేమతో  ఉంటారు . ఎలాగంటే  రంగులు మార్చే 
ఊసరవెల్లులలా  .  

10. గొప్ప చెప్పు వారు   గప్పాలు కొట్టేరు
కుప్పిగంతులతోను  కుస్తి పట్టు  
బురుగు భారి పెరిగె  బలముండు నెక్కడ   
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం*: కొందరు మనుషులు నేనే తెలివైన వాడినని , నా కంటే 
ఎవరూ తెలివైన వారు లేరని గొప్పలు చెప్పుకుంటారు. ఎదుటి వారిని 
ఒప్పించడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తారు. బూరుగు చెట్టు ఎంత 
పెద్దగా పెరిగినా ప్రయోజనం ఏమిటి.  

11. అన్ని  ఉన్న విస్తరి  అనిగిమెనిగినుండు 
ఏమి లేని విస్త   రెగిరి  పడు
కోకిల గుణమోలె  కాకికి నుండునా      
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం: అన్నీ తెలిసిన విజ్ఞాని , కుదురుగా, విలువలతో ఉంటాడు. అదే ఏమి 
తెలియని వాడు అంతా నాకే తెలుసునని ఎగెరెగిరి పడుతాడు.
కాకి బంగారు నగలు (రోల్ గోల్డ్), బంగారం వలె మన్నికగా ఉండునా . 

12. బుర్రలోన  త్రాచు   బుసలు కొడుతుంటే
నీతులు వల్లించి   నేమి ఫలం 
నివురు గప్పి నిప్పు  నిక్కము దహియించు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం : మనసులో క్రూరత్వం పెట్టుకుని , నీతులు  వల్లించి  లాభం. 
కనబడని  భగవంతుడు తప్పకుండా అణిచి వేస్తాడు . 

13. ఓటు బ్యాంకు  కొరకు  ఓటర్ల కూర్చియు 
ఆశ పెంచె  ప్రజ  లడిగి నంత 
ప్రతి ఫలము కోరి   పథకాలు వేసిరి  
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం : ఓట్లు వేయించు కోడానికి   సమకూర్చుకుని . ప్రజలు ఏమి 
కోరుకుంటే  దానిని ఇస్తా మని , హామీ ఇచ్చి , గెలుపు ధ్యేయంగా 
పథకాలు వేసిరి .   

14. మాట మార్చునట్టి  మాటకారేలిన                       
బీద జనుల గతియు  బీట వారు 
పసిడి పలుకులైన ఫలమేమి యుండును 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

15. దారి వెళ్లు  కరిని  దానవులది లించ  
తొండంబు నెక్కి  తోలు పిసుక   
కరి తిరుగబడియును  కసితీర్చుకునదా      
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


16. తల్లి కడుపు పుట్టి  తామెవరొ నెరిగి  
అమ్మ నాన్న లాది నండ  పెరిగి 
కన్న తల్లి  నాది  కాదనె 
మూర్ఖులు   
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం :  తల్లి కడుపున పుట్టి , తానెవరో  తెలుసుకుని. అమ్మా 
నాన్నల ప్రోత్సాహంతో పెద్దవారై  , కన్న తల్లినే  , నా తల్లి 
కాదనె  మూర్ఖులున్నారు  లోకంలో .  

17. జగము నంత తిరిగి జనమునేకముజేసి
భరత మాతఋణము భార మెంచి 
హడల గొట్టె  దొరల  నాజాదు నేతాజి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

18. విద్యలేని వాడు వింతైన పశువనే 
ధనములేనివారు ధరణి నుండె 
నేడు విద్యధనము నిత్య పాపులజేసె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం:  విద్య లేనివారిని వింత పశువు అని అంటారు . 
డబ్బు లేని వారు కూడా ఈ జగతిలో ఉన్నారు . కానీ నేడు 
అదే డబ్బు , విద్య  వారిని  పాపాత్ములను చేస్తుంది.

19. కొండి బలము జూప  గుణగుణ తిరుగాడు 
కోరల కదిలించు  కోడె నాగు 
తేలుపాము రెండు తెరువరులకుజంకు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం : తేలు కొండి బలం  చూపడానికి  అటు ఇటు ఇటు  
పరుగెడుతోంది పాము కోరలను చూపుతుంది . తెలు ,పాము  
రెండు  తెరువరులకు భయ పడుతాయి . 

20. తోలు తిత్తి ఇదియు  తొమ్మిది తూటులు
తుస్సుమనును  దీని  తస్స దియ్య 
అయిన మనిషి నిండ  అహమునే  నుండును  
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం: మనిషి శరీరంలో  తొమ్మిది రంద్రాలు ఉంటాయి .
ఏ రంద్రం నుండి ఎప్పుడు ప్రాణం పోతుందో  తెలియదు. 
అయినా మనిషి అహంకారాన్ని విడిచి పెట్టడు  .
భూమి మీద ఉన్న గొప్పవారిని చేరు , ఓ ప్రియమైన కృష్ణా !

21.  కణితి నిండిన తల కరిగించ లేమయ్య
నక్క జిత్తు లసలె నమ్మ బోకు  
గుణమెరిగితిరిగిన ఘణముగా నుండును 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం: తలలో చెడు మనసు నిండిన వారిని మార్చ లేము.
ఎప్పుడు ఏమి మాట్లాడుతారో , ఎప్పుడు ఏమిచేస్తారో తెలియనటువంటి 
నక్కజిత్తులవారిని అసలుకే నమ్మకూడదు . వారి గుణమెరిగి 
తిరగడమే శుభముగా  ఉండును.
భూమి మీద నివశించే  మంచి వారిని  చేరు , ఓ ప్రియమైన కృష్ణా !

22. నిశ్చలమునఘణులు నిలిచేరు విశ్వాన 
సమత లేక మనము సాగలేము
వైద్యమొక్కలుడిగి వైద్యమందించును
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


23. తెల్పెదరు హితముల చేసేరు కుట్రల
మెప్పుపొంద గురుల ఒప్పు సిరులు
నొసట ఎక్కిరించి నోటతీపిపలికె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  చాలా మంది  జనులు  ఎదుటి వారికి  నీతులు
చెప్పి ,  లోపల ఎదుటి వారిని ఎదుగ కుండా 
ఏమి చేయాలిఅని కుట్రలు పన్నుతారు.   వారి 
గురువుల మెప్పుపొందడానికిచేయ వలసిన వన్నీ చేస్తారు. 
నొసటితో వెక్కిరించి , తీయగామాట్లాడుతారు .  
ఇలాంటి వారి యెడల ఎప్పటికీ  కడు జాగ్రత్తగా ఉండాలి .

24. మనుషులెవ్వరైన మనసుండితీరాలి
విద్యయున్నమనిషి  విలువపెరుగు
నాకెవరెదురనుట నరునికేనష్టమ్ము
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  మనుష్యులకెవరికైనా మనసు  ఉండాలి . అది లేకపోతే
మనిషి జీవితమే వ్యర్థం. అలానే విద్య యుంటే మనుష్యుల
విలువ పెరుగుతుంది. నేనే గొప్ప వాడిని , నాకెవరు ఎదురులేరు
అనుకోవడం , వారికే నష్టము. 

25. గడ్డ పార తోని  గట్టిగా  తవ్విన
బావి లోని నీరు బయట  పడును
గుండు సూది వలన నుండునా ఫలితం
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: బావిని లోతుగా తవ్వడానికి  పెద్ద గునపం వాడాలి .
అలానే  ఎన్నో రోజులు  త్రవ్వాలి . అప్పుడే  మనకు  నీరు 
లభిస్తుంది . అంతే గాని గుండుసూది  తవ్వుతే  ఏమైనా 
ఫలితం ఉంటుందా ! 

26. గుణం యుండు వాడు  గురుతరముగ నుండు  
మూర్ఖు డెపుడు కూడ  మూర్ఖ ముండు
కోకిల వలె కాకి  కూయునా  పామరా
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: మంచి గుణం గల వాడు పెద్దలయందు
గౌరవ భావముతో  ఉంటాడు . చెడు గుణములు
గల వాడు ఎప్పుడూ  చెడు ఆలోచనలతోనే
ఉంటాడు . కోకిల వలె కాకి  కూయదు కదా. 

27. చెప్పుడు పలుకులును  చెడు జేయు వినినను
విలువ పోవు నీది  వీర నరుడ
వాడి వేడి ఘనుడ వయసు మీర దెవర్కి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఇతరులు చెప్పే మాటలను విని ,వాస్తవాలుతెలుసు 
కోకుండా  ప్రవర్తిస్తే , చెడే జరుగుతుంది గాని  మంచి జరుగదు. 
చెప్పుడు మాటలతో  ఉరుకు  పరుగులమీద ఉన్న , ఓ మేధావి!  
వయసు పెరగనిది ఎవరికి ?

28. పాఠ మెవరు నేర్చె  పంతులు లేకుండ
ముందు చూపు లేని  మూర్ఖ  జాతి
అనుకరించకుండ  నంబాడునా పాప
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  గురువు లేకుండా  ఎవరు విద్యనునేర్చుకోలేరు .  
తల్లిని అనుకరించకుండా  చిన్న పాప కూడా  అంబాడ లేదు .

కొందరు మూర్ఖులకు ఇవేమి అర్ధం కావు .

29. మనసు మంచిదైతె మంచినే గోరును
మనసు మలినమైతె మచ్చ దెచ్చు
పొగరు తోటి నెవరు  పోరాడ లేరయా
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు
భావం: మనసు బాగుంటే  మంచినే కోరుతుంది.మనసు 
చెడ్డ దైతే , అది అతనికే  చెడు చేస్తుంది.అలానే అహం 
గలవారు , ఎదుటి వారిమన్ననలను పొందడానికి పోరాడలేరు.

30. పలుగురి మదిలోన పలుచనైనంకను
ఎన్ని భాష లెరిగి  ఏమి కీర్తి
ఎలుక కెన్నియు న్న కలుగు నే శాశ్వతం

కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


భావం :  అహంకారంతో ,అనేక మంది మనసులోచులకన భావం 

ఏర్పడినాక , వారికి  ఎన్ని రకాలభాషలు వచ్చినా ఎలా కీర్తి 
లభిస్తుంది . ఎలుక ఎన్ని నేర్చుకున్నాఎప్పటికైనా  బొరియే కదా 
దాని నివాస స్థలం.

31. గుంపుగాకదిలిన  గురువుకారెవరును
గొర్రెవెనుక  నడుచు గొర్రె వరుస  
గులక రాళ్ళ తోటి  గూడులు కళ్ళనే
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: తమ తమ వ్యక్తిత్వాలను వదులుకుని
ఒకరికొకరు  గొర్రెల మందల్లా, సపోర్ట్ చేసుకున్నంత
మాత్రాన ఎవ్వరూ గురువు కాలేరు. గులక రాళ్లతోని
గూడు కట్టడం అబద్దం . వాటిలో / మాటల్లో నిజాయితీ,
నిబద్దత ఉండాలి . 

32. బాలు మనకు మధుర బాణిని వినిపించె
బాలు బిల్లు మనకు బతుకు నేర్పె
బాలు చివరి మజిలి బాధను కలిగించె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: బాల సుబ్రమణ్యం  గారు మనకు  వేలాది
తీయనిపాటలను వినిపించారు. బాలు  హాస్పిటల్  
బిల్లు, మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి ,  మనకు 
వీలైన జాగ్రత్తలు పాఠించక పోతే , మన కుటుంబానికి 
కూడా మిగలకుండా ఎంత నష్ట పోతాము అనేది నేర్పింది .
చివరికి  , మన బాలు  మనకు మిగులక పోవడం
చాలా బాధ కలిగించింది. 

33. ఓటు గెలుపు కొరకు నోటును ఎరవేసె  
పోటు గాండ్ల లాగ  పోరు సలుపె
గద్దె నెక్కగానె   గాదెలు నింపిరి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  ఎన్నికలలో  గెలవడానికి  ఓటుకు
నోటును  లేదా మరో దానిని ఎర వేస్తారు .
ఎంతో హోరా హోరీగా ప్రచారం చేస్తారు.
ఇక గెలిచి  , ప్రభుత్వంలో చేరాక , వారి ఖర్చుకు
వంద రెట్లు వెనుకేసుకుంటారు.

34 . నీటి నుండి తీయు  నిత్యము డెక్కాకు  
పెరుగు మళ్ళి చెరువు  బురుద లోన
చెడ్డ వాని కెన్ని  చెప్పినా  మారునా     
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: చెరువు నీటిలో పెరిగే  గుర్రపు డెక్కాకును
ప్రతి రోజు కోసి పడేసినా , అది చెరువులో పెరుగుతునే
ఉంటుంది . ఫలితం ఉండదు .అలానే , చెడ్డ   వారికి 
ఎన్ని సార్లు చెప్పినా ఉపయోగం ఉండదు . 

35 . మూర్ఖు డెపుడు కూడ ముక్కోపి వలెనుండు   
గుణము యున్న నుండు   గురుతరముతొ      
కంచు నెంత తోము  కనకము  కాదెట్లు   
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: మూర్ఖుడు  ఎప్పుడునూ , కోపముతో
అహముతో  ఉంటాడు  .మంచి గుణం
కలిగి ఉన్నవారు బుద్ధిమంతుడిలా ఉంటారు .
ఇత్తడిని ఎంత తోమినా  అది బంగారం కాదు కదా .  

36. తోక పట్టుకొనుచు తోలుబొమ్మాటలు
ఎంతకాలమయ్య ఎందుకయ్య
బతికి పొందు కీర్తి  భారమే జనులకు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  ఒకరి కొకరు ,ఒకరి మీద ఒకరు ఆధారపడి
(పారాసైట్స్ లాగా) ఎంత కాలం, ఎందుకు  ఈ తోలు 
బొమ్మలాట ఆడుతారు. ఇలాంటి వారు  ఎంతటి కీర్తి 
పొందినా , అది జనులకు నష్టమే గాని ప్రయోజనం 
ఉండదు. 

37.  బావి లోని కప్ప బయటపడినటుల
మూర్ఖ మాటలాడి మురిసి పోకు
మంచి మనసు తోటి మనుజుల గెలువాలి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  చాలా కాలం బావిలో  నివశించి , ఒక్క సారే 
బయిటకు వచ్చిన మండూకములా బెక బెక మంటూ 
మూర్ఖపు మాటలు మాట్లాడి విలువైన సమయాన్ని  
వృధాచేసుకోకూడదు. మంచి మనసుతో మాట్లాడి 
మనష్యులను గెలువాలి. 

38. నేను నేను అంటె నేనొంటరినవుత
నేనె నేనె నంటె నేనులేను 
నాతొ నలుగురంటె నడిచేరు నీవెంట
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  అహం తోటి నేను, నేనే గొప్ప అని ఫీలవుతే 
నేను ఒంటరి వాడినవుతానో, ఏమౌతానో తెలియదు.
ఆబ్లిగేషన్ అభిమానులను బట్టి ఆధారపడి ఉంటుంది. 
ఇక నేనే , నాకు మించి ఇంకెవరు లేరనుకుంటే , అంతా 
శూన్యమే. నలుగురిలో నేను ఒకడిని మాత్రమే అని 
అనుకుంటే , నీతోనే అందరూ నడుస్తారు. 

39. తప్పులేరువారు తమతప్పు కానరు 
నియమములను తుంచి నిలువరించు
తప్పులున్నగాని తామెగొప్పందురు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  తప్పులు ఎంచే వారికి , వారి తప్పుల గురించి 
తెలియదు, పట్టించుకోరు. వారు పెట్టిన నియమ
నిభందనలను పాటించకుండా, ఇతరులను నిలువరిస్తారు. 
వారివి కూడా తప్పులున్నను తామే గొప్పని భ్రమింపజేస్తారు.  

40. దూరదూరముంటె దూరబోదు కరోన
మాస్కు మూతి కడుతె మనిషి బతుకు
సల్లగబతుకుదము సానిటైజరువాడి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: దూరం దూరంగా ఉంటూ సోషల్ డిస్టాన్స్ పాటిస్తే 
కరోనా మన దగ్గరికి రాదు. తప్పనిసరయి బయిటకు వెళ్ళి
నప్పుడు మూతికి మాస్క్ కట్టుకుని ,మరల ఇంటికి రాగానే 
చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నట్లైతే కరోనా 
మనకు అంటదు. ఆరోగ్యంగా జీవించవచ్చు.

41. పుటుక తోనె రావు పుత్తడి కిరిటాలు
ధనము తోని రాదు ధరలొ విద్య
సాధనమున కలుగు సకల విజయములు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  పుట్టుకతోనే ఎవ్వరికీ బంగారు కిరీటాలు రావు. 
కేవలం ధనంతోటే విద్య రాదు. ధృడ సంకల్పంతో, 
ఇష్టంతో సాధన చేస్తే అనేకమైన విజయాలను సాధించవచ్చు.

42. ధరణి పోర్టలంత ధడను పుట్టిస్తుండె
అన్నదమ్ములందు అహము పెంచె
నాయకులనె మార్చు నాల్గేళ్లకేచూడు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ధరణి పోర్టల్ అంటే కొందరికి భయమేస్తుంది. భూమి 
రిజిస్టర్ చేసేటపుడు నాపేరు మీద అంటే నాపేరు మీద 
చేయమని కుటుంబ సభ్యుల మధ్యనే కోపాలు వస్తున్నాయి. 
ఇలా ఇంకా అనేక సమస్యలు సరిచేయకపోతె నాలుగేళ్లలో 
నాయకులు మారవచ్చు. 

43. చిత్త శుద్ధి తోడ చిరుపోర్టలు తెరిచె
అక్రమాల కడుగ అడుగలేము
పనులు జరుగనేని పంచాయితులురావు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: మంచి మనసు తోటి భూములను  క్రమబద్దం చేయడానికి,
 ప్రభుత్వం *ధరణి పోర్టల్* ను ప్రారంభించింది.  అయితే వెంటనే 
అక్రమాల తొలగించడం సాధ్యం కాదు  . పనులు సాఫీగా జరుగుతే 
ఎలాంటి గొడవలు తలెత్తవు .

44. ఒకరుమరొకరుయును ఒట్టిరాతలతోటి
రెచ్చగొడుతునుండు రేయి పగలు
చిచ్చుపెట్టు వారి  చెంతచేరువరకు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: కొందరు ఒకరికి మించి మరొకరు ఏదో వ్రాయాలని పోటీ 
పడుతారు. ఒకరు  వ్రాసిన దానిని  మరొకరు వక్రీకరిస్తారు, 
పగలు రాత్రి చూడకుండా రెచ్చగొడుతారు. 
వారికి అనుకూలంగా మారేవరకు చిచ్చులు పెడుతారు.

45. గతము మరిచి జనుల గాయపరుచనేల
కరుడు కట్టి నట్టి కలుపు గోలు
నవ్వి పోవు నరుల నడుమంత్ర సిరులకు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: మన గతాన్ని మరిచి పోయి , ఎదుటి వారిని బాధ పెట్టడం 
సరికాదు.కొందరు కలుపుగోలుగా నటించే కరుడుగట్టిన నీచులుంటారు. 
ఇలాంటి  నడమంత్రపు సిరులు గల వారిని చూసి నవ్వుకోవాలి తప్ప 
చేసేదేమి లేదు. 

46. నుదుటి రాత బట్టి నూలు పోగుండును
నుదుటి గీత బట్టి నూక చెల్లు
తత్వమెరిగి కూడ తలబాద తగదయ్య
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  నుదుటి రాతను బట్టి మన ఆర్ధిక పరిస్థితులు , సుఖం 
సంతోషాలుంటాయి. అలానే మనం ఎంతకాలం జీ బట్టి మనం 
ఎంతకాలం జీవిస్తామో అనేది ఉంటుంది. అంతే గాని ఎవరో 
పోతారంటే పోరు ,వస్తారంటే రారు.ఇది తెలిసి కూడా తలబాదు
కోవడంవృధా. 

47. తెలుగు ఆంగ్ల మాలు తేడపుట్టిస్తుండె
దారి చూపు నేమొ ధరణి పెట్టె
వేచి యుండ వలెను దారి చూపు వరకు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ధరణి పోర్టల్ లో లెటర్స్ ఇంగ్లీష్ లో, తెలుగులో ఉండటం 
వలన , ఇంగ్లీష్ లో  టైపు చేసినపుడు , తెలుగులో పేర్లు 
మారిపోతున్నాయి. అలానే తెలుగులో టైప్ చేసినపుడు ఇంగ్లీష్ లో 
పేర్లు మారుతున్నాయి. తెలుగు అంకెలు నేటి జనరేషన్ కు తెలియవు. 
వీటన్నిటిని సరిచేసి, భూముల కొలతలు రిజిస్టర్ చేసే వరకు ప్రజలు 
వేచి చూడాలి 

48. చిత్త శుద్ధి తోడ చిరుపోర్టలు తెరిచె
అక్రమాల కడుగ అడుగలేము
పనులు జరుగనేని పంచాయితులురావు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: మంచి మనసు తోటి భూములను  క్రమబద్దం చేయడానికి,
 *ధరణి పోర్టల్* ను ప్రారంభించింది.అయితే వెంటనే అక్రమాల 
తొలగించాలని అడుగలేము. పనులు సాఫీగా జరుగుతే ఎలాంటి 
గొడవలు రావు.

49. చేదు బీర దెచ్చి  చేటనిండతరిగి  
కండ శర్కరేసి  గంటనుడక      
తీపి నుండునేమి   తినుటకు కుదురునా         
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

50. నుదుటి రాత బట్టి నూలు పోగుండును
మనిషి కర్మ నెంచి  మార్పు యుండు  
తత్వమెరిగి కూడ తలబాద తగదయ్య
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


51. గతము మరిచి జనుల గాయపరుచనేల
కరుడు కట్టి నట్టి కలుపు గోలు
నవ్వి పోవు నరుల నడుమంత్ర సిరులకు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: మన గతాన్ని మరిచి పోయి , ఎదుటి వారిని బాధ పెట్టడం 
సరికాదు.కొందరు కలుపుగోలుగా నటించే కరుడుగట్టిన నీచులుంటారు. 
ఇలాంటి  నడమంత్రపు సిరులు గల వారిని చూసి నవ్వుకోవాలి తప్ప 
చేసేదేమి లేదు. 

52. సిరులు యేమి నెవరి వరముకాదెన్నడు
బంటు రాజు గాను బలపడొచ్చు 
రాజు కింకరుడయి బూజుపట్టనువచ్చు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

53. కుత్సితులకునుండు కొంచెపు గుణములు
పెద్ద వారికుండు పెద్దమనసు
కుత్సితుండ్లవలెనె కుమిలిపోయెజనులు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: సంకుచిత బుద్ధి గల వారికి సంకుచితమైన గుణాలే ఉంటాయి. 
విశాల హృదయం గలవారికి , అందరిని కలుపుకుంటూ పోవాలనే పెద్ద 
మనసు ఉంటుంది.ఈ సంకుచిత భావాలు గల వారి వలనే దేశంలోని 
ప్రజలంతా ఇబ్బంది పడుతుంటారు.

54. ఇండ్లచుట్టుఇండ్లు ఇండ్లల్లొ కోమట్లు
కోడి మాయమాయె కొంప లోన
కోడి ఎటుల పోయె కోమట్లు ఉండగ
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఇక్కడ చుట్టూ ఇండ్లన్ని వైశ్యులవే ఉన్నాయి. వైశ్యులు 
కోళ్ళను తినరు. కాని కోడి ఎలా మాయమైంది? అలానే , సమాజంలో 
అందరూ మంచి వారుగనే కనబడుతారు. అందరూ అహం , ఇగో, 
చెడు , తప్పులు మరియు మోసాల గురించి నీతులు చెబుతారు, 
కవితలు వ్రాస్తారు, కథలు చెబుతారు. అయినా అహం,  చెడు, 
తప్పులు మరియు మోసాలు జరుగుతునే ఉన్నాయి. మరి ఎవరు 
చేస్తున్నట్లు?

55. ధరణి పోర్ట లొచ్చె ధరణిని రక్షించ
కనుమరుగవునేని కబ్జగాళ్ళు
పేదపొందవలె పెద్దలభూములు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం:  భూములను రక్షించడానికి ధరణి పోర్టల్ అందుబాటులోకి 
వచ్చింది. ఇకనైనా భూకబ్జా దారులు లేకుండా పోతారుకావచ్చు. 
అప్పుడైనా మిగులు భూములను పేదలకు పంచాలి.

56. మధ్యమునకుబడుగు మరుగునటులజేసి
దేశ సంపదేమి దెలుపకుండ
గట్టి ఎత్తు లేయు గండుచీమలవలె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: బీరు , బ్రాండి మరియు సారాల త్రాగుడుకు పేదలను 
బానిసలను చేసి , దేశంలోని సంపదవైపు వారిని దృష్టి సారించకుడా 
చేస్తారు. ఆ తరువాత ఆ సంపద నంతా కొల్లగొడుతారు గండు చీమల్లాగ. 
(అందుకే ఉచితానికి ఆశ పడి హక్కులను కాలరాచుకోకూడదు.)

57. పడతి కొరకు కానుక బతుకమ్మ చీరెలు
సంతసించె వనిత సకల విదము 
ప్రభుత జరిపె నిండు   బతుకమ్మ పండుగ
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ప్రతి బ్రతుకమ్మ పండుగకు  బీద స్త్రీలకు కానుకగా ప్రభుత్వం 
చీరలను పంచుతుంది. స్త్రీలు ఎంతో ఆనందిస్తారు. ఈ పండుగను 
పిల్లలు, పెద్దలు మరియు స్త్రీలు కలిసి ఎంతో ఆనందంగా చెరువు 
గట్టున ఉయ్యాల పాటలతో ఆడుతారు.

58. భాగ్యులకొక రూలు బడుగుల కొకరూలు
నాటకులకపటము ననచకుంటె
ధనిక పేద తేడ దండిగా పెరిగేను 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ధనవంతులకు ఒక రూలు పేదలకు ఒక రూలుగా ఉన్నది 
వ్యవస్థ ఇప్పుడు.ఇలా చేసేవారిని దారిలో పెట్టక పోతే, ధనికుల 
మధ్య పేదల మధ్య వ్యత్యాసం బాగా పెరిగి పోతుంది.

59. మోసపుస్తెడబ్బు మోదంబునిచ్చినా
కష్టపడినసొమ్మె కడకు మిగులు
అక్రమార్జనంత అడవిపాలయ్యేను
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఎవరినెవరినో మోసం చేస్తూ డబ్బు సంపాదించినా ,అది 
తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. మనం కష్టపడి సంపాదించిన 
సొమ్మే చివరకు మిగులుతుంది. అక్రమంగా సంపాదించిన సంపదంతా 
మనకు కాకుండా పోవచ్చు లేదా కొత్త సమస్యలు తీసుకురావచ్చు.

60. మాట రాని ఋతువు మనుజల మేల్కొల్పు
మాట లాడు నరుడు మాట మార్చు
మనిషి లోని అహము మనిషినే కాల్చునే 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: మాట్లాడ లేని ఋతువులు మనుష్యులను జాగరుపరుస్తుంటాయి. 
మాటలు మాట్లాడే మనిషి ఒక్క మాటకు కూడా కట్టుబడకుండా అహంతో ,
మాట మారుస్తూ ఉంటాడు.ఇలాంటి మనుష్యులను వారి అహమే వారిని 
నిదానంగా దహించి వేస్తుంది.

61. రైతు భూమి కుండె రయితుబంధుస్కీము
మైను భూమి ఫలము మయిను కుండె
కౌలుదారుకేవి కవులుపథకములు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: రైతులకు ఉంది రైతు బంధు పధకం. మైనింగ్ చేసే భూములు 
వ్యవసాయ భూములుగా రిజిస్టర్ అయినవి కాబట్టి వాటికి రైతు బంధు 
పధకం వర్తిస్తున్నది. మరి నిత్యం వ్యవసాయం చేసే కౌలుదారు కేది స్కీం. 
ప్రత్యక్షంగా కష్ట నష్టాలను ఎదుర్కునే కౌలుదారులకేది ప్రభుత్వ సాయం.

62. ఏడు పదులు దాటె ఎన్నెన్నొ వెతలాయె
పదిఅనుమతులకును  పనికి రారు
పన్నులన్ని కట్ట బాధించ సరికాదు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: 70 యేండ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు ఆరోగ్య పరంగా, 
మానసికంగా ఎన్నో ఇబ్బందులుంటాయి.ఈ వయసులో వారికి  
ఉద్యోగాలు చేయాలన్నా , ఇన్స్యూరెన్స్ తీసుకోవాలన్నా, అప్పు
చేయాలన్నా దేనికి అవకాశం ఉండదు. అలాంటి వారిని ఆదాయపన్ను , 
ఇంటిపన్ను , వాహనపన్ను మొ.న పన్నులను చెల్లించమని బాధించడం 
సరికాదు. డబ్బు సంపాదించే టపుడు ఎలాగో  పన్నులు చెల్లించారు.

63. కుంభ వృష్టి వాన కురిసెను రాష్ట్రాన 
రాజధానిలోన రాత్రి నుండి
తలుకు మిలుకు లేక తల్లడిల్లిరి జనం
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. 
ఇక రాజధానిలో రాత్రి నుండి 28 సెం.మీటర్ల వర్షం కురిసింది. కరెంట్ 
లేక , ఇండ్లళ్ళకు నీరు వచ్చి   ప్రజలు ఇబ్బందులు పడిరి. (13.10.2020)

64. జనుల ముంచి నెవరు జారుకోలేరెవరు
ఎవరి కర్మ వారె ఎన్నడైన
అనుభవించకుండ అడ్డుకోలేరిల
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: అన్యాయంగా  ప్రజలను మోసం చేసిన వారెవరు కూడా 
తప్పించుకోలేరు.  మోసాలకు , అక్రమాలకు ఎవరు పాల్పడినా, 
వారు ఎంతటి వారైనా, ఏనాటికైనా వారో లేక వారి కుటింబీకులో 
(వీరి అక్రమ సంపాదనలో పాలు పంచుకున్నవారు)  , అవమానాలు 
లేదా శిక్షలు అనుభవించి తీరుతారు. 

65. లేని వాడు గంజి  లేకనే చస్తుంటే
ఉన్న వాడు బెంజి  నుండ గోరె   
మరిక సరిసమాన  మయ్యేది యెన్నడు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


66. మోరి పొంగి పొరలె మోకాళ్ళ లోతుగా
తప్పుసర్కరుదన  తగదు మనకు
వేగుజాముచెత్త వేయకు మోరిలో
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: కుండపోత వర్షం కురిసి మోరీలు నిండి పొంగి పొర్లి మురికి నీరు 
ఇండ్లళ్ళకు రావడానికి కారణం సర్కారే అని నిందించడం తగదు. ప్రజల
 అశ్రద్ధ కూడా ఉంది. ఏ వస్తువులు పాడైనా చెత్తబుట్టలో వేసి దూరంగా 
పడేయరు.సీసాలను, డబ్బాలను, గుడ్డలను, ప్లాస్టిక్ వస్తువులను, ఇతర 
వస్తువులను మోరీలలో వేస్తూ ఉంటారు. అందువలన మోరీలు బ్లాక్అవు
తన్నాయి. ప్రజలు చెత్తను మోరీలలో వేయకుండా శపధం చేయాలి. 
చెత్త వేసిన వారిపై ఫైన్ వేయాలి.

67. నరము లేని మనిషి నాలుకెన్నోచెప్పు
తమవరకును వస్తె తాము వేరు
నుండు ధరణి లోన ఉన్మాది లాగున
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఇతరుల కొరకు , నరం లేని నాలుక ఏమైనా చెబుతుంది. ఎన్నైనా 
చెబుతుంది. కానీ వారి వరకు వస్తే, మేము ప్రత్యేకం అంటారు. అలాంటి 
వారు కూడా అక్కడక్కడా ఉంటారు.

68. ఆశ విడిచి పెట్టు అహమెల్ల దూరమౌ 
పాపము ధనమీడు  భయము పోవు 
కోరిక విడనాడు కొలువుదీరుమనసు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: భయం ఎందువలన ఏర్పడుతంటే, మనిషి కి వివిద విషయాలపై 
అత్యాశ , కోరికలు ఉండటం వలన మరియు జీవితంపై అవగాహన లేకపోవడం 
వలన ఏర్పడుతుంది. అత్యాశ ,కోరికలు, అహాలు, తగ్గించుకుని, మనస్సును 
అదుపులో పెట్టుకుంటే భయం ఉండదు.

69. తప్పుతప్పనుటకు తాకత్తు నుండవలె
ఒక్క చేయి నూప నొరుగునేమి  
రెండు చేత్లు చరుచ రేగును శబ్దము   
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఇది తప్పు , అది ఒప్పు అని చెప్పడానికి లేదా ఒకరిదే తప్పు 
లేదా ఒప్పు అనడానికి వీలు కాదు.కాలాన్ని బట్టి , పరిస్థితులను బట్టి 
మారు తుంటాయి . ఇది తప్పు ,అది ఒప్పు అని చెప్పడానికి ఎంతో 
ధైర్యం కావాలి.ఒకరే చేయి ఊపితే  నష్టమేమి ఉండదు . ఇద్దరు కలిసి
కొట్టుకున్నా , గొడవ పెట్టుకున్నా  సమస్య మొదలవుతుంది . 
రెండు చేతులు కలిస్తేనే శబ్ధం వస్తుంది.

70. పిట్ట కథలు చెప్పు  పిల్లలు వినునట్లు   
మాట విననివాండ్ల  మరిచి పోరు 
దోచి దాచు చుండు  దొరికిన కాడికి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: పిల్లలకు సహితం అర్ధమయ్యే విధంగా కొందరు చిన్న చిన్న 
కథలు చెప్పి  చేస్తారు . మాట వినని వారిని ఏదో విధంగా దారికి తెచ్చు
కునే ప్రయత్నం చేస్తారు. అందిన కాడికి దోచుకుని దాచి పెట్టుకుంటారు.

71. తప్ఫుచేసినపుడు  తగవులాడుటమాను 
మంచి చేసినెడల మనసుపెంచు
రాయి తొక్కు జనులు రాయిశిల్పముమొక్కు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: తెలిసో తెలియకో తప్పు చేస్తే ఒప్పేసుకుని గొడవకు దిగవద్దు . 
ఏదేని గొప్ప పని చేసినపుడు ,పెద్దమనసుతో ఉండాలి గాని ప్రచారం 
చేసుకోకూడదు. రాయి గుడి మెట్లుగా ఉన్నపుడు, దానిని తొక్కి లోని
కెలుతాము. అదే రాయిని శిల్పంగా చెక్కుతే , గుడి లోపల కెళ్ళి 
మొక్కుతాం. మంచి పని చేస్తే తప్పకుండా మంచి పేరే వస్తుంది.

72. ఇంట గెలువ కుండ ఇలనెగ్గ లేమయా
సంఘ జనుల ముందు   సంస్కరించు
సాలు దున్న కుండ సాగుచేయగలమా
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఎవరైనా సరె ఇంట్లో గెలువకుండా లోకంలో గెలువ లేరు.
ముందు కుల సంఘం బంధువుల సంస్కరించు. పొలం లేదా చెలుకను 
దున్న కుండా పంట పండించలేము కదా.

73. కలుపు గోలు తనం కలుగును మేలోయి
కరుచు కుంటు పోతె  కలహమెండు 
కన్నబిడ్డలోలె కలుపుక పోవలె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: కలుపు గోలు తనంతో మెదులుకోవడం వలన 
అందరికీ మేలు జరుగుతుంది. అదే  కరుచుకుంటూ పోతే 
ఒకరిపై ఒకరికి కోపాలు పెరిగి పోతాయి. ప్రతి ఒక్కరిని 
తమవారివలె కలుపుకపోవాలి. లేనట్లయితే ,దీని 
ప్రభావం సమాజంపై పడవచ్చు.

74. వయసు పెరుగుతున్నవాలకంమారదు
చేష్ట లుడుగెనేమి  చేతులునువణుకు    
ఆకరిగడియైన అహమును వీడునో
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: కొందరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే ,వయసు 
పెరుగుతున్న వారి తీరు మారదు. అహం వలన వీరి ముందు 
మరొకరు ఎదుగకూడదనే బలమైన పట్టుదల ఉంటుంది. 
చేతులు వనికే  స్థాయిలో వారి చెడు  పనులు  తగ్గవచ్చు . 
చివరి దశలో నైనా వీరి అహాన్ని వీడుతారో.  

75. నిజం వెలుగుముందు నీడదారిమరలు
ఎవరు నేమి యన్న నేర్పు గుండు   
కాలమె గుణమెరిగి కలిచివేయుఖలుల 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: వెలుగనే నిజాలు బయటకు వస్తుంటే , నీడ అనే అసత్యాలు ప్రక్క
దారులు పడుతాయి. అందుకే ఎవరేమన్నను కృంగి పోకూడదు. వారి 
తప్పును వారే తెలుసుకునేట్లు చేయాలి. కాలమే సమాధానం చెబుతుంది.

 76. తరువు  నెవరునాటె తరువునెవరు పెంచె
చెట్టు రక్షణిచ్చె చెట్టు చేర
మానుకున్న గుణము మనిషికి లేదాయె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: చెట్టును ఎవరు నాటారో తెలియదు. ఎవరు పెంచారో కూడా 
తెలియదు. కాని ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకునే స్వచ్చమైన గుణం 
చెట్టుకు ఉంటుంది. కాని మనిషికి అలాంటి గుణం లేదాయే. వృక్షోరక్షతి,రక్షితః.

77. సహనముంటెజనులు సడలించు నేతల 
సహన మందు మెండు   సాను భూతి
సర్వమెల్ల డొల్ల సహనమెక్కడనుండు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఓపిక ఉన్నంత కాలం ప్రజలు , నేతలతో కలుపుగోలుగా  
ఉంటారు   . ఆ సహనంలో   సాను భూతి, గౌరవం  ఉంటుంది. 
ఎప్పుడైతే ఇచ్చిన మాట నిలుపు కోరో, ఎప్పుడైతే తిరిగి  అబద్ధాలు 
ఆడటం మొదలు పెడుతారో, అప్పుడు ప్రజలలో అసహనం పెరిగి 
పోతుంది.

78. కార్పొరేషనులతొ  కలతలు తీరునా 
కులములవిభజనతొ   కూర్మి కల్ల
ఓటు గెలుపు కొరకు నొకమెలికేకదా
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: బి.సి.కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం వలన పేదల బాధలు తీరవు. 
(దేశం అభివృద్ధి చెందదు) కులముల విభజించడం వలన పేదల స్నేహం  
అబద్దం  .  ఆర్ధిక అసమానతలు  తగ్గవు . ఇదంతా ఓటు బ్యాంకు కోసం చేసే 
ఎత్తుగడ మాత్రమే. (దేశంలో పేద ధనికగా మాత్రమే విభజన జరుగాలి. 
రిజర్వేషన్స్ క్రమబద్దీకరించవలె.)

79. కులము మీద జాతి కుదుటపడుననుట
పెరటి లోన గరిక  పెంచి నట్లు
కులములవిడగొట్టి  కుంపటి రగిలించె 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: కులాల పేరు మీద జాతి అభివృద్ధి జరుగుతుందనడం ,
పెరటి లోన  గడ్డిని పెంచి నట్లుంటుంది. ఓటు బ్యాంకు కోసం 
కులాలను విడగొట్టి ,ఏవో కొన్ని విధాల ఆశలు చూపి, చెప్పుచేతల్లో 
ఉండేవిధంగా బానిసలుగా చేయుచుండె.

80. వర్షములకు పంట వరదలోనమునిగె
పట్టణము మునిగెను పల్లమంత 
నష్టమునకు సొమ్ము  కష్టతరముమారె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: వర్షాలకు పంటలు వరదలో మునిగాయి. అలానే నగరం  
లోతట్టు ప్రాంతాలు మునిగి పోయాయి. ఇప్పుడు ఇక్కడ అక్కడ 
పూర్తి  మొత్తంలో నష్ట పరిహారం చెల్లించడానికి డబ్బు లేక 
ప్రభుత్వానికి  కష్ట తరంగా మారె.

81. గుమ్మడాకు మరియు  గునుగు తంగేడుల
సిబ్బి పైన పేర్చు సిరులు కురువ
తనివి తీర కొలువు తల్లి బతుకునిచ్చు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: గునుగు , తంగేడు మరియు  రకరకాల పూలను తెచ్చి, 
సిబ్బిపైన గుమ్మడి ఆకు వేసి పేర్చి బతుకమ్మను కొలువు , మీకు  
సిరులు, సంతోషాలు లభిస్తాయి. 

82. విజయ దశమి రోజు వీరపాండవులు
పాల పిట్ట చూసి పరవశించె
జమ్మి చెట్టు చేరి జయముల నొందెను
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: పాండవులు అజ్ఞాతవాసం వీడిన తరవాత 
మొట్టమొదటి సారిగా వారు చూసినది పాలపిట్టను. 
(అందు వలననే వారు కురుక్షేత్ర సంగ్రామంలో విజయం 
సాధించారు. అందుకే పాలపిట్టకు అంత ప్రాధాన్యత.) 
ఆ తరువాత జమ్మి చెట్టు వద్దకు చేరుకుని, ప్రదక్షణలు చేసి, 
దానిపై వారు దాచిన అస్త్రశస్త్రాలను తీసుకుని యుద్దానికి 
వెళ్ళి విజయం సాధిస్తారు.

83. నీతి చెప్పువారు నిత్యము యెదురగు    
తమవరకును  వస్తె తాము వేరు
తామెవరొ తెలియక తన్మయమొందేరు .
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం : నీతులు  చెప్పువారు  ప్రతిరోజు  ఎదురైతారు . 
వారి వరకు  వస్తే , మేము  వేరు  అంటారు .  తాము ఎవరో 
తెలియక  తన్మయం పొందేరు . 

84. ఎన్నికలలొనిలిచి ఎన్నిహామీలైన
వాక్సినేమి ఖర్మ వజ్రమిచ్చు 
ప్రతిన నెరవేర్చ పన్నులన్ పెంచేరు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఎన్నికలలో నిలబడి ఎలాంటి హామీలనైనా ఇవ్వవచ్చు. 
వాక్జిన్   ఏమి ఖర్మ  , వజ్రం  ఇస్తామని  కూడా హామీ ఇవ్వవచ్చు . 
నియంత్రణ అంటూ ఏమీలేదు. ప్రజలకు అడిగే శక్తి లేదు. కాబట్టి 
పోటీ చేసే ఏ పక్షమైనా ఎలాంటి హామీలైనా ఇచ్చి, ప్రజలు అవి 
అమలు చేయాలని వత్తిడి తెచ్చినప్పుడు, పన్నులను పెంచండి.
( క్షమించాలి. నిజంగా నే ప్రభుత్వాలు పన్నులను పెంచాలని 
చెప్పడం కాదు. వాస్తవాలను ఓటర్లు ఇలాంటి తాత్కాలిక తాయిలాలకు 
ఆశ పడకుండా, సమర్ధవంతమైన, నిజాయితీ పరులైన నాయకులను 
ఎన్నుకుని , రాజ్యాంగం ద్వారా మనకు లభించే హక్కులను 
సాధించుకోవాలని నా ఆశయం.ఒక పాలన చూసైనా మరో పాలనకు 
జాగ్రత్త పడాలి.)

85. భార్య భర్త లిరుల  భగవంతుడేకూర్చు
ఆలి నొచ్చుకుంటె ఆగు పనులు 
సతియుమెచ్చనడువు , సహజీవనముచేయ
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: స్త్రీ పురుషులను , భార్యాభర్తలుగా భగవంతుడే కలుపుతాడు. 
భార్య బాధ పెడుతే ,ఆ రోజు పనులన్నీ ఆగి పోవచ్చు. భార్య మెచ్చే 
విధంగా, ఆమెకు అనుకూలంగా  నడుచు కుంటే , సంతోషంగా, 
ప్రశాంతంగా జీవితం గడుపవచ్ఛు.

86. ఉల్లి గడ్డ ధరలు నుట్టెక్కుతూనుండే  
వందకు కిలొ ధరతొ వణుకు పుట్టె
భారముపెరుగంగ  బతుకు దుర్భరమయ్యె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఉల్లి గడ్డల ధరలు, రోజు రోజుకు పెరిగి పోయి 
ఈరోజు కిలోకు రూ.లు 100/-అయింది. దీని వలన పేదలకు 
భారం  పెరిగి జీవితం కష్టముగా మారినది.

87. ఎన్నికలలొ ఖర్చు యెంతైనా పెడుతారు
మోస డబ్బు తోడ మోస గించి 
గద్దె నెక్కి దోచి  గాదెల్లనింపను
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఎన్నికలలో ఖర్చు ఎంతైనా పెడుతారు.  ( వాస్తవానికి, 
ఎన్నికలలో ఖర్చు చేయడానికి, ఒక చట్ట ముంది. దాని ప్రకారం 
శాసనసభకు పోటీ చేయు వారు 30.80 లక్షలు, పార్లమెంటు కు 
పోటీ చేయువారు 77 లక్షలు ఖర్చు పెట్ట వచ్చు. అంతకు మించి 
ఒక్కరూపాయి  ఖర్చు చేసినా ఎన్నిక చెల్లదు.) మోసపు డబ్బు తోటి 
ఇటు ప్రజలను, అటు చట్టాలను మోసగించి, అధికారం చేపట్టి ,
అవకాశమున్న వరకు దోచేస్తూ ,ప్రజలను గాలికి వదిలేస్తున్నారు.

88. కన్నబిడ్డయెడల కరుణలేనిజనులు 
జన్మనివ్వకున్న జనము మెచ్చు
విజ్ఞులైనజంట విడిపోవ ధర్మమా
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: కన్న కొడుకు , కూతురు మీద ప్రేమలేని తల్లి దండ్రులు , 
పిల్లలకు జన్మనివ్వకున్నా జనులు హర్షిస్తారు .చదువుకుని,విజ్ఞాన 
వంతులై యుండి , పిల్లలను వదిలి వెళ్లి పోవడం, విడాకులకు 
కోర్టుల చుట్టూ తిరుగుతూ, పిల్లలను అనాధలను చేయడం ధర్మం 
కాదు. ఏదైనా వివాహం కాకముందు లేదా పిల్లలు కాక ముందు 
ఆలోచించాలి. పిల్లలు జన్మించాక అడ్జస్ట్ అవ్వాలి. కలిసి బ్రతకాలి . 

89. రాగి చెంబు నీరు రతనాల నీరోయి
పొద్దు బుక్కతాగు  పొసగు మేలు 
నిత్య మెల్ల తాగు నిగనిగ లాడేవు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: రాగి చెంబులో నీరు చాలా పరిశుద్ధంగా ఉంటాయి  మరియు 
క్రిములు  ఉత్పత్తి  కావు .  ఉదయాన్నే పరిగడుపున ఒక గ్లాసెడు త్రాగుతే 
శరీరం ఆరోగ్యకరంగా బాగుంటుంది.అలానే ప్రతి రోజూ త్రాగి నట్లయితే 
శరీరం నిగనిగ లాడుతుంది.

90. గొప్పచెప్పువారు గోతులుతవ్వేరు 
కుప్పిగంతు లేసి కుస్తి పట్టు  
తనకుతెలిసెలోగ తనువును వీడేరు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం : కొందరు మనుషులు నేనే తెలివైన వాడినని , నా కంటే 
ఎవరూ తెలివైన వారు లేరని గొప్పలు చెప్పుకుంటారు. ఎదుటి వారిని 
ఒప్పించడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తారు. తనకు  మంచి ఎదో 
చెడు  ఎదో తెలిసే లోగానే  తనువు విడుస్తారు . 

91. పూర్వ జననములని పునరుజననమని   
స్వర్గ నరకములని సాకు చూపె   
పాపపుణ్యములకు పరిహారమిక్కడే 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: పూర్వ జన్మలున్నాయో లేవో  అలానే స్వర్గం నరకాలున్నాయో,
లేవో ఎవరికి తెలియదు. వాటి పేరు చెప్పి  చాలా మంది  సొమ్ము 
చేసుకుంటున్నారు .  పాపాలు, మోసాలు చేస్తున్నారు . ఎవరైనా  
పాప , పుణ్యాలకు కలియుగంలోనే  ఫలితం  అనుభవించి తీరుతారు . 

92. పడ్డ వాడెపుడును చెడ్డవాడవ్వడు
హేళనైనగాని హేమముండు 
కాలమే ఖలులకు కనువిప్పు కలిగించు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: తన తప్పు లేక పోతే, మాట పడిన వాడు ఎప్పటికీ చెడ్డవాడు కాడు. 
హేళనైనా కూడా మంచులా కరిగి పోతుంది. కాలమే నీచులకు తెలిసేటట్లు 
చేస్తుంది.

93. యేడడుగులునడిచి యేలుజీవితమని
భార్య భర్తలమని బాసచేసి
వేరు నవుద మనుట విజ్ఞతనుండునే 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: వేద మంత్రాలతో వివాహం జరిపించుకుని, ఏడడుగులు నడిచి ,
ఒకరి అడుగులో ఒకరు  అడుగువేసి, భార్యాభర్తలుగా, అర్ధేచ, కామేచ, 
మోక్షేచ నూరేళ్ళు కలిసి ఉందామని ప్రమాణం చేసి, విడి పోదామన 
డానికి మనసేల వస్తుంది.

94. ఆవు భరతదేశ  ఆరాధ్య దేవత 
కష్టములను బాపు  కామధేను
జంతువావు హింస జనులకునుతగదు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఆవు భారతీయుల కన్న తల్లి  , ఆనంద హరివిల్లు .పాలు , పెరుగు , 
నెయ్యిని , పేడను అందించి మనకష్టాలను తీర్చే కామ ధేనువు . అలాంటి 
ఆవు  అనితెలిసి కూడా వధించడం ప్రజలకు మంచిది కాదు.
95. యాచకులకుబిక్ష యోచన చేయాలి
అడిగినట్లు యిస్తె  నాశ పెరుగు
భిక్ష అడుగు కొనుట బిడయపడవలెను
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: యాచకులకు బిక్షవేయునపుడు అందరూ ఆలోచించాలి. 
త్రాగడానికి బిక్షాటన చేస్తున్నారా లేక సోమరులుగా మారడానికి 
బిక్షాటన చేస్తున్నారా గుర్తించి వారికి ఏది అవసరమో అదే బిక్షంగా 
ఇవ్వాలి. బిక్షాటన చేయడం , సిగ్గుగా వారు భావించే టట్లు చేయాలి . 
ప్రజలు సోమరులుగా మారడంవలన దేశంలో   ఉత్పాదకత శక్తి 
తగ్గిపోతుంది.

96. భావ జాలమున్ను భాషలు వేషాలు
అరుపు నచ్చ కుంటె  ఆగమేల  
వ్యక్తి  సేచ్ఛ ననుచ  వలపన్నడంబేమి      
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: ఈ రోజు  అర్నాబ్ గోస్వామి (జర్నలిస్ట్ ,  రిపబ్లిక్ టి.వి .
చీఫ్ ఎడిటర్ ) కి బెయిల్ మంజూరు చేస్తూ , హానరబుల్  సుప్రీం కోర్ట్
ఘాటైన  వాఖ్యలు చేసింది , ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రెస్ కు ఎంతో ,మనో  
ధైర్యాన్ని  ఇచ్చింది . "మీకు ఎదుటి వారి భావ జాలములు, వేష భాషలు,
అరుపులు  నచ్చకుంటే , ఆగం కాకండి.ఊరుకోండి . కానీ వ్యక్తి స్వేచ్ఛను  
హరించే  అధికారం మీకు ఎవరు ఇచ్చారు?  అని బెయిలు మంజూరు చేసింది .
(తేదీ . 11 .11 .2020 ) 

97. నాయకుండుపోతె నాయక సభ్యులే  
జాలి ఓట్ల కొరకు జపంజేసి
గద్దె నెక్కి జనుల  కష్టంబు  దోచిరి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: రాజకీయ నాయకులు ,ఎదో కారణంగా  చనిపోతే,వారిపై అభిమానంతో  
ఓట్లు పడుతాయని , వారి వారసులనేపోటీకి నిలబెడుతారు. వారికి ఏమీ చదువు , 
తెలివి, సమర్ధత  లేకపోయినా  జాలి ఓట్లతో  గెలిచి , అధికారం చేపట్టి , ఐదు 
సంవత్సరాలు  ప్రజలపై పెత్తనం చెలాయించి , దోచు కుంటారు . (ఎన్నికల 
విధానంలో నైనా మార్పులు రావాలి లేదా  ప్రజలలో చైతన్యం రావాలి.) 

98. దేశ సంపదంత దేవుళ్ళపాలాయె 
పేద జనులు నిల పెరిగి పోయె
దేశము అభివృద్ధి దేవుడే ఎరుగును
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: దేశ సంపద దేవుళ్ళ గుడులకే చేరుతుంది. మరో వైపు పేద ప్రజలు పెరుగు
తున్నారే గాని తగ్గడం లేదు. ఇక 73  సం.రాల నుండి దేశం అభివృద్ధి చెందుతూ 
ఉన్న విషయం దేవుడికే తెలుసు. 

99. ఉన్నవాడు పోతె ఉరుకుపరుగులతొ
దండ వేసి మెడన దాచెపెట్టె
పేదకాకువేసి పెడుతనే మేలుండు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: డబ్బు ఉన్నవాడు మరణిస్తే, ఎంతో ఎంతో ఘనంగా కార్యక్రమాలతో 
సాగనంపి కంచుతో విగ్రహాలు చేయించి పెట్టి మాలవేసి దండంపెడుతాం.అలానే 
బ్రతికున్న కడు పేద వారికి ఒక ఆకు వేసి పిడికెడు అన్నం పెడుతే ఎంత బాగుండు.

100. లవణమంతనైన లక్ష్యమున్ననుచాలు
కొండనైననేమి పిండి చేయ
దేశ రక్షనందు  దేహము రవ్వంత
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

101. దేశ ఖ్యాతి నిలిపి దేశదిశనుమార్చె
ప్లాను  తోడ  వృద్ధి  పరుగు పెట్టె 
వారి ఘాటు కూల్చ వాంఛ యేలకలిగే
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

102. కొడుకు బిడ్డ మేలు కోరని తలిదండ్రి
కనడ మేమి ధరణి  కలుప నేమి
జన్మ నివ్వకుండ జాగుచేయుటమేలు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

103. కులము వృద్ధి పెంచ కూర్మితోపులకించి
ప్రబుతెకరముభూమి నెంచి చూపె 
ఆశ తోడ నుండె అన్నియుసంఘాలు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

104. కోర్టు నందు న్యాయ కోవిదులుగెలిచె
ప్రజలకున్న ఈతి  బాధ బాసె
ఐక మత్యముంటె హాయిగొలుపునోయి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

105. పుట్టి నపుడు రాదు పుత్తడి కొంతైన
గిట్టి నపుడు పోదు మట్టి కూడ
నడుమ నెందుకంత నాటకపు సిరులు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

106. మాటకారు లెల్ల  మాయలు జేశేరు 
నమ్ముకున్న జనుల  నిండ ముంచు 
అడుగడుగున నుండు నవతార పురుషులు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

భావం: అధికంగా మాట్లాడే వారు మోసాలకు పాల్పడుతుంటారు.
వారు నమ్మిన వారిని స్వార్ధానికి వాడుకుని నష్ట పరుస్తారు.
ఇలాంటి అవతార పురుషులు  అడుగడుగునా  ఉన్నారు .

107. పూసినపుడె తెలియు పుష్పాలపరిమళం 
పాప కాదు నామె పంచ దార 
తల్లి దండ్రులకును దారిని చూపెను     
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

108. ఎగుర లేని పక్షి ఏమి తినగలదు
పక్షి బిడ్డ పెట్టె పక్షి నోట
మనిషి తెలుసు కోడు  మమతల మధురము
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


109. భూమి కుండు నెంతొ  భూదేవి  సహనము  
అహము తోడ నెవరు ఆడ వలదు  
పండితులనయనను  పండబెట్టుతనలో  
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు


110. వేప చెట్టు గాలి విరుచును రోగాల      
మల్లె చెట్టు పూలు  మాల చేరు    
తుమ్మ చెట్టు నీడ  కమ్మధనమెక్కడ  
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

111. పాప పుణ్య కర్మ బాపలేరెవ్వరు 
కర్మ ఫలితములను ధర్మ మెంచి
ననుభ  వించ కుండ నరుడును  పోలేడు 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

112. మూర్ఖునకునుకోపం ముక్కుపైనేనుండు
నిజం నిగ్గు తేల్చ   నీలుగు తుండు   
ఉనికి   కొరకు జనుల నుడికిస్తు నుండును  
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

113. పుష్కరాలకెలితె  పుణ్యంబులొచ్చని 
పాపములను చేయ  పరుగు లెత్తు 
కూటి కోసమునిల  కోటివిద్యలుపుట్టె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

114. బుర్రలోన అహము బుసలనుకొడుతుంటె
నీతు లెన్నొ చెప్పి  నేమి ఫలం
నివురు గప్పి నిప్పు నిక్కము దహియించు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

115. కుక్క నైనజాలి కురిపించునక్కపై   
ప్రేమ అమ్మ పైన పెంచ లేరు 
ఆశ్రమములొ వుంచి ఆధరణ మరిచె 
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

116. యెంతనువివరించ యేమియుబోధించ
ఉనికి పెంచు కునుట కురుకులాడు 
గర్వ మున్ననరుడు మర్వలేడలవాటు   
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

117. సాగరములనుండి రాగాలునేర్వో చ్చు  
యిసుక నుండి నూనె  పిసుక  వచ్చు 
మాట వినని నరుల  మార్చను లేమయా  
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

118. పంటచేను లన్ని పచ్చగా పెరిగిన 
కలుపు మొక్క పెరిగి  కాటువేయు 
గుణములుగలవాన్ని గుణహీనుడివలెనే       
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు

119. జనుల పైక ములతొ  జనులకు వలలేయు  
జనుల మభ్య పెట్టి  జయము నొందు 
పథక ఖర్చులన్ని   పన్నుల నుండియే
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు 


No comments:

Post a Comment