*మార్గం నానీలు*
నానీల పుట్టుక
నానీల సృష్టికర్త డాక్టర్ ఎన్ .గోపి తన నానీలు కవితా సంపుటిలో అన్నట్లుగానే నాలుగు పాదాల నానీ కవితారూపం కాల కఠిన పరీక్షకు నిలిచి పదమూడు సంవత్సరాలుగా దూసుకుపోతోంది ప్రవాహంలా. 'నానీ' రెండక్షరాలే పాఠకలోకమంతా పరవశిస్తోంది ప్రతిభకలిగిన కవుల కలాల్లోంచి పువ్వుల్లా కవితా సుగంథాన్ని పంచుతున్నాయ్. వేలాది నానీలు ఈ రోజు అక్షరాలై చిగురిస్తున్నాయి.
తెలుగు కవిత్వంలో లఘురూపాల్లో కొత్త చరిత్రతో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఒఠ్ఠి మౌనంగా సహజ సుందరంగా ఎదిగి ఒక ఉన్నత స్థాయిలో వ్యాప్తి చెందాయి. సరదాకోసం రాయడం కాకుండా సమాజ చైతన్య దిశగా కొత్త లక్ష్యం దిశగా నానీ రూపు దిద్దుకుంది. సామజిక , సాంస్కృతిక చైతన్య భానుడుగా నానీలు పరిణామం చెందింది.
For more related Videos , please watch my youtube channel :
https://www.youtube.com/@margamsahitya
లక్షణాలు
నానీలకు కొన్ని లక్షణాలు ఎన్ .గోపి చెప్పారు. 20 -25 అక్షరాల సంఖ్యగా నాలుగు పాదాలు తప్పక ఉండాలి. రెండు యూనిట్ల పరస్పర సంబంధం. సాగదీయకుండా మరీ తగ్గించకుండా ఒక క్రమశిక్షణ. 5 అక్షరాల వెసులుబాటు కూడా కల్పించారు. లక్షణాలు తప్పకుండా నానీలో పాటిస్తే ఆ కవిత తప్పకుండా కాలపరీక్షకు నిలబడతాయి. భావావేశం ఉంటేగాని నానీ సాంద్రీకరణ చెందదు. అలాగే మంచి నానీ రాయటం కూడా చాలా కష్టం. కొత్తగా కలంపట్టిన యువకవులకు నానీ ఒక శక్తిగా అక్షరాల దేవతగా కనిపిస్తోంది. కవితా రూపంగా నానీలను అక్షరాలు అటూ ఇటూలో రాస్తున్నారు. భావం పండుగా ముగ్గినప్పుడే రుచి వస్తుంది. అలాగే మంచినానీగా జనం గుండెల్లో నిలుస్తుంది. గోపి కవిత పరిశీలించండి-
రైలు పట్టాలు/ తాము కలవ్వు గాని/ దూరాలనుకలుపుతాయి. ఇలాంటి మంచి నానీ హృదయాలను కలుపుతాయి. నానీలలోని సంక్షిప్తరూపం ఈనాటిది కాదు. వేమన ,సుమతి వంటి శతకాల్లో ఎన్నో ఉన్నాయి. ఆరుద్ర కూనలమ్మపదాలు డాక్టర్ సి. నారాయణరెడ్డి గజళ్లు, వంటివి ఎన్నో తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి. గణబంధాలు, మాత్రల బంధాలు, దేశఛందో గణనియమాలు లేక ఇది వచన కవిత్వమే. వచన కవిత్వం రూపంలోని విస్తృత రూపానికి సంక్షిప్త స్వరూపం. చిన్నభావం, అత్యల్ప సంవిధానం, ముక్తకం, కంఠస్థ యోగ్యం, కవితా సౌందర్యం నానీకి మరికొన్ని లక్షణాలు. నానీ కవితారూపం ఆత్మీయమైంది. అందుకే నానీల కవితా సంపుటాలు అనేకం ప్రతిఏటా ముద్రింప బడుతున్నాయి. వెల్లువలా రావడం గమనించతగ్గ విషయం.
నామకరణం
నానీలని ముద్దుగా పేరుపెట్టింది గోపి . నావీ నీవీ వెరసి మనవి అని, నానీలంటే చిన్నపిల్లలు. చిట్టి పద్యాలని వివరించారు. కవిలో ఎక్కువగా చెప్పాలనే భావ సందేశం, ఆవేశం, గుండె స్పందించాలనే తపన కవి, పాఠకుల హృదయాల్లో నిలవటానికి అవకాశం కల్గింది. నేతల ప్రతాప్‌కుమార్ నానీ పరిశీలిస్తే - 'ఓపూట గడిచింది/ అన్నదానంతో/ జీవితమే వెలిగింది/ రక్తదానంతో' 'అన్నదానం -రక్తదానం'లలో ఏది గొప్పదో కవి చక్కగా కవితలో ఆవిష్కరించారు. తెలుగు సాహిత్య రంగంలో అత్యాధునిక దేశీప్రక్రియ 'నానీ' 1997 లో ఆచార్య ఎన్.గోపి కలం నుండి కవితా రూపంగా పురుడుపోసుకున్నది. కాలంతో ప్రవహిస్తూ 13 సంవత్సరాలు తనదైన భావశైలితో, వస్తు నిర్మాణంతో, ధారాశక్తితో, గాఢత, సాంద్రతతో ఒక కెరటంలా ఎగిసిపడే ఉదాత్త గుణంతో 'నానీ' సూటిగా పాఠకుని హృదయాన్ని తాకుతోంది. ఈ నేపథ్యంలో వస్తువైవిధ్యంతో ఇప్పటి వరకూ వేలాది నానీల సంపుటాలు ప్రచురించబడ్డాయి. వీటిలో సమకాలీనత కనిపిస్తుంది. తొలినాట నానీల కవిత్వానికి స్ఫూర్తిని కల్గించిన వారిలో సొమెపెళ్ళి వెంకట సుబ్బయ్య ఒకరు. ఆయన నానీ పరిశీలించండి- చిన్నప్పటి/ ఉత్తుత్తి బువ్వలాటలు/ పెద్దయ్యాక/నిజమై పోయాయేమిటి- అంటూ బాల్య జ్ఞాపకానికి ప్రపంచం ఆకలిబాధను ముడివేసి చెప్పిన సామాజిక చైతన్యం కనిపిస్తుంది కవితలో కవి ప్రతిభకు గీటురాయి. నానీలు మెరుపు తీగలు .
2001వ సంవత్సరం నుండి నేటివరకూ కోన సీమలో నానీలకు గుడికట్టిన కవి నల్ల నర్సింహా మూర్తి . ప్రకృతి అందాలను, సామాజిక అంశాలను తన నానీలలో ఆవిష్కరిస్తూ నానీల చైతన్యానికి తనవంతు కృషి చేస్తూ గోపి అభినందనలు పొందారు. 2009లో అమలాపురంలో 'నానీల శిక్షణా నిలయం' ఏర్పాటు చేసి ఎందరో యువకవులను నానీల కవులుగా తీర్చిదిద్దిన ఘనత నల్లా నరసింహమూర్తికి దక్కుతుంది. కోనసీమలో పది నానీల సదస్సులు నిర్వహించి నానీల వ్యాప్తికి ఎంతగానో కృషి చేస్తున్న కవి. నడక ఉద్యమంలో నానీల ద్వారా ఆరోగ్య సందేశాన్ని అందిస్తూ 'నడక నానీలు' సంపుటి ప్రచురించి పేరుపొందారు. ఇంకా 'నడక నడిస్తే..' 'నడక నడిచే వేళ..' నడక ఆరోగ్యం 'నడక నాతల్లి' వంటి అనేక నానీల నడక సంపుటాలు ప్రచురించారు.
పల్లె జీవన వాస్తవికతపై కలం స్పందన, ప్రపంచీకరణపై ప్రతిస్పందనలు, పేదరికంపై కనికరం, అవినీతిపై ఆగ్రహం, కంప్యూటర్ సంస్కృతిపై స్పందన, విద్యా, వైద్యరంగంలో కార్పొరేట్ సంస్కృతిపట్ల నిరసన, ప్రకృతి సౌందర్యం పట్ల ఆరాధన ,ప్రకృతి విపత్తులు, రైతుల ఆత్మహత్యలపై సానుభూతి, దళితుల సమస్యలపై నానీలు, పంట విరామంపై ఆవేదన, ఉగ్రవాదం నిరుద్యోగం, నడక, ధరల పెరుగుదల వంటి అనేక అంశాలపై, సమస్యలపై కవులు ప్రతిభావంతంగా చిత్రిస్తున్నారు. మహాకవి శ్రీ శ్రీ అన్నట్లు 'కాదేదీ కవిత కనర్హం' అంటూ 'కాదేదీ నానీల కనర్హం' అని నిరూపించారు.'అబ్బే!/ ఏదో ఓటమి కాదు/ అది విజయానికి మరోమెట్టు'